Monday, June 16, 2025
Homenewsన్యూయార్క్‌ కు చెందిన ‘న్యూస్‌ వీక్‌’ మ్యాగ్‌జైన్‌కు మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ

న్యూయార్క్‌ కు చెందిన ‘న్యూస్‌ వీక్‌’ మ్యాగ్‌జైన్‌కు మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ

త్వరలో జరగనున్న ఎన్నికల్లో 97 కోట్ల మందికిపైగా అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 60 కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు వేశారని ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 10 లక్షల కంటే ఎక్కువ పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. న్యూయార్క్‌ కు చెందిన ‘న్యూస్‌ వీక్‌’ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

భారతదేశ మూలాల్లోనే  ప్రజాస్వామ్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల్లో 97 కోట్ల మందికిపైగా అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంతటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా రెండో విడత పదవీకాలం ముగిసేలోపు మద్దతు కోల్పోతుందని.. కానీ తమ ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో తమ ప్రభుత్వానికి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందన్నారు. “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్” అనే నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

2014కు ముందు 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ ఇప్పుడు  ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది దేశ ఆకాంక్ష అని ప్రధాని చెప్పారు. గత పదేళ్లలో దేశంలో జాతీయ రహదారుల విస్తీర్ణం 60 శాతం పెరిగిందని.. విమానాశ్రయాల సంఖ్య రెండితలయిందని వివరించారు. సాగరమాల ప్రాజెక్ట్‌తో ఓడరేవుల సామర్థ్యాన్ని పెంచామన్నారు. పౌరుల సౌలభ్యం కోసం “వందే భారత్” రైళ్లను ప్రారంభించామని సామాన్యులు విమానయానం చేసేందుకు ఉడాన్ పథకాన్ని తీసుకువచ్చామని చెప్పారు. రామ మందిర ప్రారంభం గురించి మాట్లాడుతూ..రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకు తిరిగి రావడం దేశ ఐక్యతకు సంబంధించిన ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేకుండా పోయిందంటూ ఇటీవల విపక్షాలు చేసిన ఆరోపణలను కూడా మోదీ ప్రస్తావించారు. భారత్ ఓ ప్రజాస్వామ్యదేశం అని రాజ్యాంగంలోనే కాదు .. దేశ మూలాల్లోనే ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బలమైన ఆర్ధిక శక్తిగా భారత్ ఎదిగిందని, ఆ క్రమంలో చైనాతో పోటీపడుతోందని చెప్పారు. ఉపఖండంలో శాంతిభద్రతలను నెలకొల్పామని ఫలితంగా ఉగ్రవాదం, హింస నుంచి విముక్తి కలిగిందని పాక్ పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370ని ఎత్తివేయడంతో జమ్మూకశ్మీర్ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయని అన్నారు. 370 ఆర్టికల్‌ను ఎత్తివేసిన తర్వాత అక్కడ ఫార్ములా-4 రింగ్ ఈవెంట్లు, మిస్ వరల్డ్, జీ-20 సమావేశాల వంటి ప్రపంచ స్థాయి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు.

భారత్‌, చైనా మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికీ కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సరిహద్దు అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన.. దౌత్య, సైనిక స్థాయిల్లో సానుకూల, నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  భారత్‌ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అన్నారు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతోందని, దౌత్యపరంగా, శాస్త్రీయంగా, సైనికపరంగా ఎదుగుతున్న తీరు.. భారత్‌ ఓ వర్ధమాన సూపర్‌ పవర్‌గా నిలబెడుతోందని అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌లతో ఏర్పడిన క్వాడ్‌ కూటమి.. ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని మోదీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS