ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా పేరుగాంచిన చినాబ్ బ్రిడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ జిల్లా సాంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. ఈ ట్రయల్ విజయవంతమైందని, త్వరలో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని ఉత్తర రైల్వే విభాగం పేర్కొంది. 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ వంతెన, చైనాలోని షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్లు) కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ప్రపంచప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ ఎత్తు గల ఈ వంతెన, కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు ఉపయోగకరంగా మారనుంది.

