తెలంగాణలో బీజేపీ ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అధికారమే లక్ష్యంగా, 2028కి టార్గెట్ పెట్టుకుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలతో భారీ విజయాన్ని సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి దీటైన పోటీ ఇచ్చింది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామన్న ధీమాతో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపడతామని బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, గతకంటే రెట్టింపు సీట్లు గెలిచింది. 8 ఎంపీ స్థానాలు సాధించడం ద్వారా, రాష్ట్రంలో తమ పట్టు మరింత బలపరిచింది. పెరిగిన సీట్లతో పాటు, ఓట్ల శాతం కూడా పెరగడం కమలం శ్రేణుల్లో జోష్ నింపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు సాధించిన బీజేపీ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ తో 8 ఎంపీ స్థానాలు గెలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ, హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల విజయంతో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ, తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని ధీమా వ్యక్తం చేస్తోంది.