హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద జరిగిన ఈ తాజా సంఘటన నగరంలో పెద్ద సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి తీసుకున్న చర్యలపై భారీ వివాదం చెలరేగింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై జీహెచ్ఎంసీ కమిషనర్ బదిలీ వేటు వేయడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.
———అసలేం జరిగింది?———–
శనివారం నాడు జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద ఉన్న జగన్ నివాసం ముందు అక్రమంగా నిర్మించబడిన సెక్యూరిటీ గదులను కూల్చివేశారు. ఈ సెక్యూరిటీ గదులు రోడ్డు పై అక్రమంగా నిర్మించబడ్డాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడంతో, అధికారులు ఈ చర్యలు చేపట్టారు. జగన్ భద్రత కోసం సెక్యూరిటీ గదులు అవసరమని ఆయన మద్దతుదారులు వాదించినప్పటికీ, ట్రాఫిక్ సమస్యలు, ప్రజల అసౌకర్యాల కారణంగా ఈ కట్టడాలను తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈ కూల్చివేతలపై ముందుగానే నోటీసులు ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు..
———–లోటస్ పాండ్———-
లోటస్ పాండ్ జగన్ జీవితంలో కీలక ప్రదేశం. సీఎం అయ్యే ముందు జగన్ ఇక్కడ నివాసం ఉండేవారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని అక్కడే నివాసం ఉండటం మొదలు పెట్టారు. ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా షర్మిల మరియు విజయమ్మ ఇప్పటికీ లోటస్ పాండ్ లో నివసిస్తున్నారు. జగన్ సెక్యూరిటీ కోసం ఫుట్‍పాత్ ఆక్రమించి గదులు నిర్మించడం, వాటిని కూల్చివేయడం, ఈ చర్యలపై ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా వ్యవహరించడం కారణంగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు పడింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి హేమంత్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు అధికారులు ముందుకు రావడం, వారి విధులను నిర్ద్వంద్వంగా నిర్వర్తించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. .ఈ సంఘటన నగరంలోని అక్రమ కట్టడాల సమస్యపై మరింత చర్చకు దారితీసింది. జీహెచ్ఎంసీ అధికారులు తమ విధులను నిర్ద్వంద్వంగా నిర్వర్తించడం, కానీ అదే సమయంలో ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా వ్యవహరించడం వల్ల ఏర్పడిన పరిణామాలు పెద్ద చర్చకు దారితీసాయి.

