లోక్‌సభ ఎలక్షన్స్ ముందు తమిళనాడులో తీవ్ర విషాదం జరిగింది. ఈరోడ్ ఎంపీ, ఎండీంకే నేత గణేశ మూర్తి(Erode MP Ganeshamurti) ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన మార్చి 24న బలవన్మరణానికి పాల్పడ్డారు. కోయంబత్తూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు.
అసలేం జరిగింది..?
2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకే(MDMK) పార్టీకి ఈరోడ్ ఎంపీ స్థానం దక్కింది. ఆ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గణేశమూర్తి(Erode MP Ganeshamurti) డీఎంకే చిహ్నం ఉదయించే సూర్యుడి గుర్తుపైనే పోటీ చేసి విజయకేతనం ఎగరేశారు.
అయితే ప్రస్తుతం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకే(MDMK) పార్టీకి తిరుచ్చి స్థానాన్ని కేటాయించారు. అక్కడి నుంచి తమ అభ్యర్థిగా దురైవైగోను పార్టీ ప్రకటించింది. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన గణేశ మూర్తి ఆత్మహత్యాయత్నం చేశారు.
మార్చి 24న ఉన్నట్టుండి గణేశ మూర్తి(Erode MP Ganeshamurti) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పరిణామాల్లో విషపూరిత ట్యాబ్లెట్లు మింగి ఎంపీ గణేశ మూర్తి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న గణేశ మూర్తి పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం మృతిచెందారు. ఆత్మహత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గణేశ మూర్తి ప్రస్థానం..
గణేశ మూర్తి(Erode MP Ganeshamurti) 1947 జూన్‌లో జన్మించారు. ఆయనకు ఇప్పుడు 77 ఏళ్లు. 1993లో ఎండీఎంకే(MDMK) పార్టీ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే పార్టీలో కొనసాగారు. 1998లో తొలిసారి పళని లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.

అనంతరం అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేసి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2014లో గణేశ మూర్తి ఓటమిని చవిచూశారు. ఇక గత ఎన్నికల్లో ఈరోడ్ స్థానం నుంచే 2 లక్షల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరేశారు.
2016లో ఎండీఎంకే పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టిన.. గణేశ మూర్తి ఈసారి ఎలక్షన్లలో పోటీ చేయాలని భావించారు. సీనియర్ నేత మరణంతో పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.